పెళ్లిపీటలపై గ్యాంగ్‌స్టర్‌ వరుడికి బేడీలు.. 'తాళి కట్టనీయండి సారూ' అంటూ పోలీసుల కాళ్లపై పడ్డ వధువు

  • పెళ్లి జరుగుతుండగా గ్యాంగ్‌స్టర్ ఆకాష్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
  • తాళి కట్టేందుకైనా అనుమతించాలని వేడుకున్న వధువు
  • పూజారిని కిడ్నాప్ చేసి డబ్బు డిమాండ్ చేసిన కేసులో అరెస్ట్
  • ఆకాష్‌పై హత్య సహా 31 తీవ్రమైన కేసుల నమోదు
  • మెడపై 'ఇల్లీగల్' అని టాటూ వేయించుకున్న ముఠా సభ్యులు
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. పెళ్లి పీటలపై కూర్చున్న ఓ గ్యాంగ్‌స్టర్‌ను పోలీసులు మెరుపుదాడి చేసి అరెస్ట్ చేశారు. వరుడు తాళి కట్టే సమయంలో పోలీసులు మండపంలోకి ప్రవేశించి అతడిని అదుపులోకి తీసుకోవడంతో, వధువుతో పాటు పెళ్లికి వచ్చిన వారంతా నివ్వెరపోయారు.

'ఇల్లీగల్ గ్యాంగ్' నాయకుడిగా పేరుమోసిన ఆకాష్ అలియాస్ భూరా పెళ్లి జరుగుతుండగా ఈ ఘటన జరిగింది. వరుడిని పోలీసులు తీసుకెళ్లడంతో చేతులకు మెహందీ, పసుపుతో ఉన్న వధువు సీమ నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. ‘సార్, నా జీవితం నాశనమవుతోంది. కనీసం రెండు గంటల పాటు అతడిని వదిలేయండి. తాళి కట్టాక మళ్లీ తీసుకెళ్లండి’ అని పోలీసుల కాళ్లపై పడి వేడుకుంది. స్టేషన్‌లోనే పెళ్లికి అనుమతి ఇవ్వాలని కోరింది. అయితే, ఆకాష్‌పై తీవ్రమైన నేరారోపణలు ఉండటంతో ఆమె అభ్యర్థనను పోలీసులు తిరస్కరించారు.

భోపాల్‌లోని వాజ్‌పేయి నగర్ కేంద్రంగా ఆకాష్ ఈ ‘ఇల్లీగల్ గ్యాంగ్’ను నడుపుతున్నాడు. ఈ ముఠాలోని 50 మంది సభ్యులు తమ మెడపై ‘ఇల్లీగల్’ అని టాటూ వేయించుకోవడం గమనార్హం. ఆకాష్‌పై హత్యాయత్నంతో పాటు మొత్తం 31 తీవ్రమైన కేసులు ఉన్నాయి. 2024లో బీజేపీ యువమోర్చా నేత సురేంద్ర కుష్వా హత్య కేసులోనూ ఇతను ప్రధాన నిందితుడు.

తాజాగా ఓ పూజారిని కిడ్నాప్ చేసి రూ. 8 లక్షలు డిమాండ్ చేసిన కేసులో పోలీసులు ఆకాష్‌ను అరెస్ట్ చేశారు. బాధితుడిని బంధించి, చిత్రహింసలకు గురిచేయడమే కాకుండా, డబ్బు ఇవ్వకపోతే అత్యాచార కేసు పెడతామని బెదిరించారు. బాధితుడి ఫిర్యాదుతో టెక్నికల్ ఆధారాలు సేకరించి, పెళ్లి మండపంలోనే నిందితుడిని పట్టుకున్నారు. ఆకాష్‌తో పాటు మరో ఐదుగురు అనుచరులను కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.

Akash alias Bhura
Bhopal
Illegal Gang
Madhya Pradesh
Crime
Kidnapping
Surendra Kushwaha
BJP Yuva Morcha
Arrest
Wedding

More Telugu News